స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం
పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే ప్రారంభం కావటం విశేషం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో పేరుగాంచిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ జి ఎల్ ) తయారు చేసిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పీ ఆర్ టీ సీ) సోమవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సులను లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాశ్‌నాథన్, ముఖ్యమంత్రి ఎన్ . రంగసామి, సభాపతి ఆర్. సెల్వం లు అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ వి ట్రాన్స్ పీవిటీ ఎల్ టి డి ) గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ( జి సి సి ) విధానంలో 12 సంవత్సరాలపాటు నడిపించటం తో పాటు మెయింటెనెన్స్ చేస్తుంది. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన విద్యుత్ బస్సులు నడిపే కార్యక్రమం పుదుచ్చేరి ప్రభుత్వం పరిశుభ్రమైన, సమర్థవంతమైన, ఆధునిక ప్రజా రవాణా దిశగా వేసిన ముందడుగుగా చెప్పవచ్చు. పీ ఆర్ టి సి నడిపే ఈ బస్సుల్లో 9 మీటర్ల పొడవు గల 15 నాన్-ఏసీ, 10 ఏసీ బస్సులున్నాయి. ఇవి ఒక్కసారి చార్జ్‌పై సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ బస్సులు శబ్ద, కాలుష్య రహితంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.






