సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్ : ఇలా ఇంకెన్నాళ్లు హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్దులు, యువతీ యువకులు, విద్యార్థులు..ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. యువతులకు స్కూటీ అన్నారు, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. ఈ పైసలు ఎక్కడికి పోయాయని మహిళలు ఎదురు చూస్తున్నారని వారికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్ అని చెప్పి మహిళలకు ఫ్రీ ఇచ్చి.. పురుషులకు రేట్లు పెంచారని , మోయ లేని భారంతో లబోదిబోమంటున్నారని వాపోయారు కేటీఆర్. భార్యకు ఫ్రీ ఇచ్చి భర్త నుంచి ఆ డబ్బులు లాక్కుంటున్నారని మండిపడ్డారు.
ఇక వీళ్లకు పాలన చేత కాదని ఆనాడే చెప్పామని, అదే నిజమైందన్నారు. బంగారం ఇచ్చే బాపతు కాదని మేం ముందే చెప్పామన్నారు. ఇప్పుడు సామాన్యులు కాదు కదా డబ్బున్న వాళ్లు కూడా కొనలేని స్థితికి బంగారం చేరుకుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ఒక్క ఇల్లు కట్టలేదు కానీ, వేలాది ఇళ్లు మాత్రం కూల్చేశారని వాపోయారు కేటీఆర్. హైడ్రాకు పెద్దల ఇల్లు కనిపించవు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కనిపించదు., కానీ పేదల ఇల్లు కూలగొట్టేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు . ఇది కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని నొక్కి చెప్పారు. రెండేళ్ల కిందట ఇలానే ప్రజలు మోస పోయారని, ఇక మరోసారి మోసానికి గురి కావద్దంటూ హెచ్చరించారు.






