రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు
రంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ల, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కంకర లోడ్ తో వెళుతున్న లారీ అత్యంత వేగంగా రావడం, బ్యాలెన్స్ తప్పి బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో డ్రైవర్ కూడా ఉన్నారు. మరో వైపు బస్సుల సంఖ్య పెంచక పోవడం కూడా ప్రధాన కారణమని అంటున్నారు.
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలు దేరింది. అందరూ ఆదివారం సెలవు కావడంతో తాండూరుకు వెళ్లారు. తిరిగి ప్రయాణం అయ్యారు. అంతలోనే కానరాని లోకాలకు వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు కూడా ఉన్నారు. పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో రాచకొండ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బస్సులో ఇరుక్కు పోయిన వారిని బయటకు తీసుకు వచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ సమాచారం తెలిసిన వెంటనే హుటా హుటినా ఘటనా స్థలానికి వెళ్లారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా విచారణకు ఆదేశించామని చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇస్తామని ప్రకటించారు.






