స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా డేటా అన్నది కీలకంగా మారిందన్నారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గురువారం సీఎం అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సదస్సుకు హాజరయ్యారు.ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనా పరంగా కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. దిగ్గజ ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకుని సాంకేతిక పరంగా మరింత మెరుగైన, వేగవంతమైన పాలనను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సర్కార్ డేటా ఆధారిత పాలన సాగిస్తోందని అన్నారు. దీని వల్ల ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు డేటా తెలుసుకునేందుకు వీలు కలుగుతోందని చెప్పారు. దీని వల్ల సమయం వృధా కాదన్నారు. అంతే కాకుండా ఒక్క ఏపీ రాష్ట్రంలోనే వాట్సాప్ ద్వారా పాలనకు సంబంధించిన అన్ని సర్వీసులు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలవడం ఖాయమన్నారు.






