చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాపన
చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లవుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతాన్ని ఆలాపించారు. దేశం పట్ల ఉన్న తమ భక్తిని ఈ విధంగా చాటుకున్నారు. వందేమాతరం అనేది భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్యోతి అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం అని పేర్కొన్నారు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు. చిత్తూరు పట్టణములోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందేమాతరంను ఏకస్వరంగా ఆలాపించారు.
ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. వందేమాతరం అనేది దేశభక్తి నినాదం మాత్రమే కాదు, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి అని అన్నారు. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదం అని పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మ విశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందని చెప్పారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఈ రోజు విద్యార్థులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం ద్వారా మన దేశ ఏకతను, ఐకమత్యాన్ని ప్రతిబింబించారు.






