చెరువును కాపాడినందుకు ధన్యవాదాలు
హైదరాబాద్ : తమ చెరువును కాపాడారంటూ కొన్ని కాలనీల ప్రజలు, తమకు వరద ముప్పు తప్పించారని మరి కొన్ని కాలనీల నివాసితులు హైడ్రాకు శుక్రవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్న హైడ్రాకు పలు కాలనీల ప్రజలు బాసటగా నిలిచారు. హైడ్రా వచ్చింది మా కష్టాలు తీర్చిందంటూ పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద కష్టాలను తాము నేరుగా చూశామని, హైడ్రాకు ఫిర్యాదు చేయగానే ఆ సమస్యను పరిష్కరించిన తీరును కూడా గమనించామన్నారు. దశాబ్దాల సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని తాము ఊహించలేదంటూ పలువురు హైడ్రాకు అభినందనలు తెలిపారు. ర్యాలీలు తీసి, హైడ్రాకు అభినందనలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
బాగ్లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీ కష్టాలు వర్ణనాతీతం. 5 సెంటీమీటర్ల వర్షం పడితే ఈ బస్తీని వరద ముంచెత్తుతుంది. నడుం లోతు నీటిలో ఇళ్లకు చేరడం గగనం. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే వచ్చి హుస్సేన్ సాగర్ ప్రధాన వరద కాలువకు అనుసంధానం చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వరద కాలువను ఆక్రమించి మల్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందనగానే వెంటనే ఆ సమస్యను పరిష్కరించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించి మద్దతు పలికారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ విలేజ్లోని తురకవాణికుంట నుంచి దేవరయాంజల్ చెరువుకు వెళ్లే వరద కాలువ 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. అక్కడ కొంతమంది ఆ నాలాను కేవలం 2 ఫీట్ల పైపులైను వేసి మిగతా భూమిని కబ్జా చేయడంతో తమ ప్రాంతాలన్నీ నీట మునుగు తున్నాయని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.






