ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు
హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు ఉందని తనకు అనిపిస్తోందన్నారు. ఒకసారి ఆస్పత్రిలో చూపించుకుంటే మంచిదని హితవు పలికారు. సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు జగదీశ్ రెడ్డి. తనను చూసి సిగ్గు సిగ్గుపడేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నిఘా పెట్టడానికి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే, రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్‌లో కూర్చుని మాపైన నిఘా పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.
బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్ పైన కమిషన్ వేయవచ్చు కదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సవాల్ విసిరారు జగదీశ్ రెడ్డి. ఏది ఏమైనా హైదరాబాద్ అభివృద్ధి అజెండా పైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్ఆర్‌ను, సోనియాగాంధీని తిట్టింది రేవంత్ రెడ్డి కాదా , ఆ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడేదో సుద్ద పూస లాగా మాట్లాడితే ఓట్లు వేస్తారని అనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదన్నారు. ప్రగతి భవన్‌కు పోదామా.. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు చూపిస్తావా అని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతావని మండిపడ్డారు.






