ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం
హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మీ మధ్య గడపడం నాకు జీవిత కాల జ్ఞాపకంగా గుర్తుండి పోతుందన్నారు రేవంత్ రెడ్డి. గత 14 సంవత్సరాలుగా రచన టెలివిజన్ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, వారికి అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ లో ప్రారంభమై దేశ సరిహద్దులు దాటి భక్త కోటికి హర హర మహాదేవ నామాన్ని వినిపిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారిని అభినందిస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఆధ్యాత్మికత మనందరికీ ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నా జన్మదినం కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీ మధ్య గడపడం మరిచి పోలేనని అన్నారు సీఎం. ఆశీర్వదించిన భక్తకోటికి నా అభినందనలు, శుభా కాంక్షలు తెలియ చేస్తున్నానని చెప్పారు. భక్తి టీవీ దేశంలోనే అత్యధిక భక్తులు వీక్షించే ఛానల్ గా మన్ననలు పొందుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తామన్నారు.







