తరలి వచ్చిన భక్త బాంధవులు
తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి తీసుకు వచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్ప స్వామి వారిని చిన్న గజ వాహనంపై వాహన మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయ నాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. కాగా ఈ వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి పెద్ద కుమారుడైన శ్రీ పెద తిరుమలాచార్యుల వారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్లనో ఈ కార్తీక వన భోజనోత్సవం ఆగి పోయింది.
సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరంలో పునరుద్ధరించింది. అయితే 2020 నుండి కార్తీక మాసంలో వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాలు జరుగలేదు. ఐదేళ్ల తర్వాత పార్వేట మండపంలో వన భోజన మహోత్సవం నిర్వహించడంతో వేలాదిగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని భగవంతుని సమక్షంలో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు, హరికథలు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.







