కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తాము తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వచ్చే 2029 సంవత్సరం నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్బంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలిపామన్నారు. వీటి ద్వారా ఉద్యోగాల కల్పన తప్పకుండా జరుగుతుందన్నారు.
ఏలూరు లాంటి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కింద వీటికి చేయూత ఇస్తాం అన్నారు సీఎం. కొల్లేరులో ఉన్న సమస్యల్ని పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు. పంటల ప్రత్యామ్నాయం పట్ల రైతులు ఆలోచించాలని సూచించారు సీఎం. తెలంగాణా ప్రభుత్వం 10 ఎకరాల భూమి విక్రయిస్తే రూ.1350 కోట్లు వచ్చిందన్నారు. గతంలో చేసిన అభివృద్దే వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు.






