మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
గుంటూరు జిల్లా : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. పలు అంశాలపై చర్చించారు.. పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని కోరారు. ఒక్కో కార్యకర్త కొత్తగా మరో 100 మందిని పార్టీలో చేర్చేలా కృషి చేయాలని కోరారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి సర్కార్ అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. అంతే కాకుండా గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల గురించి కూడా తెలియ చేయాలని సూచించారు. పార్టీ కేడర్ అంతా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ ను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వంగలపూడి అనిత.






