మాజీ మంత్రి సంచలన కామెంట్స్
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమీషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు కొత్త థర్మల్ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని ఆరోపించారు. ఏకంగా రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై ఆల్‌పార్టీ మీటింగ్‌లో నైనా, బహిరంగంగా నైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పారదర్శకంగా ముందుకకు వెళ్తున్నామనే నమ్మకం ప్రభుత్వానికి ఉంటే తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ‘2026 నాటికి థర్మల్ పవర్ ఉత్పత్తిని 40 నుంచి 30 శాతానికి తగ్గిస్తామని శ్వేత పత్రంలో ప్రభుత్వం చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారు. థర్మల్ పవర్‌ను పక్కనబెట్టి గ్రీన్ కరెంట్ పాలసీని తీసుకొస్తున్నామని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో, అనేక సభల్లో ప్రకటించలేదా అని నిలదీశారు హరీశ్ రావు.
తాను ఆర్థిక మంత్రిగా పని చేసినప్పుడు మీలాగా 20 నుంచి 30% కమీషన్లు తీసుకోలేదన్నారు. ఆర్థిక శాఖ చరిత్రలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ ఆర్థిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన చరిత్ర ఏనాడైనా ఉన్నదా? మన ఊరు- మనబడి బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏరోజైనా సచివాలయంలో ఆందోళనకు దిగారా? చిన్నచిన్న గుత్తేదారులు గతంలో ఎప్పుడైనా నిరసనకు ఉపక్రమించారా? చివరకు మాజీ సర్పంచులు ధర్నాలు చేసి అరెస్టవ్వడం చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని నిప్పులు చెరిగారు. నోరు పారేసుకోవడం సులువు భట్టి అంటూ భగ్గుమన్నారు. రాజకీయాల్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుందన్నారు.






