అందంగా తీర్చి దిద్దాలని రంగనాథ్ ఆదేశం
హైదరాబాద్ : బమృక్నుద్దౌలా చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువును
అందంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ చెరువు ఔట్‌లెట్ నుంచి వెళ్లే నీరు కిందకు పోయేలా కాలువలను అంతే సామర్థ్యంతో నిర్మించాలని స్థానిక అధికారులకు సూచించారు. ఇప్పటికే రహదారుల విస్తరణతో పాటు నిర్మాణ పనులు చేపట్టామని జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కమిషనర్‌కు వివరించారు.
1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించిన బమృక్నుద్దౌలా చెరువు. ఈ చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి ఔషధ గుణాలతో వచ్చిన ఊట నీటిని మాత్రమే నిజాంలు వినియోగించే వారని చరిత్రకారులు చెబుతున్నారు.
అంతే కాదు.. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి వినియోగించేవారని.. అరబ్ దేశాలకు ఇక్కడి నీరు తీసుకెళ్లే వారని కొంతమంది పేర్కొంటున్నారు. ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పునరుద్ధరణకు నోచుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు సంబుర పడుతున్నారు. పాతబస్తీలో ఇలాంటి అభివృద్ధి చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని హైడ్రా ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసిందని కొనియాడారు. చారిత్రక చెరువు పునరుద్ధరణతో పాతబస్తీకి కొత్త వెలుగులు అందిస్తున్నారని కొనియాడారు.






