ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌదరి సమీక్ష
తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘన వ్యర్థాలను తొలగించడం పై కూడా చర్చించారు.
పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్పర్ మెషిన్లను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్న ప్రసాద కేంద్రంలోని కిచెన్ కు బయో గ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో అంగీకారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ తరఫున సిఈ సత్యనారాయణ, ఈఈ వాటర్ వర్క్స్ సుధాకర్, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఐఓసీఎల్ ఈడీ పియూష్ మిట్టల్ (వర్చువల్), ఇంజినీరింగ్ సీజీఎం ఎలమరన్, సీఎస్ఆర్ డీజీఎం కైలాష్ కాంత్ (వర్చువల్), డివిజనల్ హెడ్ జయంత్ కుమార్, ఇంజినీరింగ్ ఇన్ ఛార్జ్ స్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






