స్పష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య
బెళగావి : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పోస్టు వివాదం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరైనా సరే పోస్టును ఆశించడంలో తప్పు లేదన్నారు. బుధవారం బెళగావిలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సభలో సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఇదే సమయంలో మీ సీటు పోతోందని మీడియా అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి అనేది శాశ్వతం కాదని అన్నారు. ఎవరైనా పోటీ పడేందుకు అర్హత కలిగి ఉంటారని, కానీ ఎవరు ఉండాలనేది నేను కాదు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అప్పటి వరకు ఎవరైనా ఎన్ని రకాలుగానైనా తమ అభిప్రాయాలను తెలియ చేస్తారని, వారి కామెంట్స్ ను ఆసరాగా చేసుకుని తాను స్పందించడం మంచి పద్దతి కాదన్నారు. తానైనా, డీకే శివకుమార్ అయినా ఎవరైనా సరే పార్టీ నియమావళిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. తమకు పదవుల కంటే పార్టీ ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య. ఇదిలా ఉండగా మరో వైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఎలాగైనా సరే ముఖ్యమంత్రిని కావాలని పట్టుదలతో ఉన్నారు. ఇందు కోసం పార్టీ హైకమాండ్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది.






