మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు
ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్బంగా మామిడి జెల్లీపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కాకినాడ ప్రాంతంలోని గ్రామీణ కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో, మామిడి జెల్లీ (మామిడి తాండ్ర) ఉత్పత్తి చాలా ప్రజాదరణ పొందిందని అన్నారు. జీవనోపాధికి కీలకమైన వనరుగా పని చేస్తున్నదని తెలిపారు. 400 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ఈ పరిశ్రమ 15,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ మహిళలు పని చేస్తున్నారని తెలిపారు.
తమ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు తాను స్వయంగా మామిడి జెల్లీ యూనిట్లను స్వయంగా తనిఖీ చేశానని చెప్పారు. కార్మికులతో సంభాషించాను, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను పదేపదే కలిశాననని చెప్పారు. GST తగ్గింపును అభ్యర్థించడం జరిగిందన్నారు. ఈ సాంప్రదాయ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూ ఫిబ్రవరి , ఆగస్టులలో నేను వివరణాత్మక ప్రాతినిధ్యాలను కూడా సమర్పించినట్లు తెలిపారు ఎంపీ.






