
సవాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం
అమరావతి : తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి సర్కార్ కొలువు తీరి 15 నెలలకు పైగా అయ్యింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించాయి ఆయా పార్టీలు. ఈ మేరకు స్థలాన్ని కూడా ఖరారు చేశారు. అనంతపురం వేదికగా దీనిని చేపట్టాలని, ఇందు కోసం 10వ తేదీని నిర్ణయించాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సూపర్ సిక్స్ బంపర్ హిట్ పేరుతో బహిరంగ సభకు పేరు పెట్టారు. ఓ వైపు అప్పులు ఉన్నప్పటికీ ఎక్కడా తగ్గకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తోంది కూటమి సర్కార్.
ఈ సందర్బంగా విజయోత్సవ సభగా దీనిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను , చేపట్టిన సంస్కరణలు, తీసుకు వచ్చిన పథకాలు, ఇచ్చిన హామీలు, తదితర వాటిపై ప్రజలకు తెలియ చేయనున్నారు. ఇదిలా ఉండగా గత పాలకులు చేసిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారింది. వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది. పరిశ్రమలూ పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఏపీ రోడ్ల గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ హేళనగా మాట్లాడిన దుస్థితి. అనేక ఆర్ధిక సవాళ్లు ఉన్నా ఊహించని స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది కూటమి ప్రభుత్వం.
15 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా నిర్ణయాలు అమలు చేసింది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఇంకోవైపు అంటూ పాలనను పరుగులు పెట్టించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే పాలనా పగ్గాలు చేపడుతూనే పెంచిన పెన్షన్లను అమలు చేసేలా తొలిసంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హామీ ఇచ్చిన నాటి నుంచే పెంచిన పెన్షన్లు అమలయ్యేలా మూడు నెలల బకాయిలు కలిపి వృద్ధులు, దివ్యాంగులు, ఇలా వివిధ కేటగిరీలకు చెందిన పెన్షనర్లకు అందించింది కూటమి సర్కారు. ప్రతీ నెలా జరిగే సామాజిక పండుగగా పెన్షన్ల పథకం అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.