
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ బంపర్ హిట్ అయ్యిందని చెప్పారు. కూటమిలోని ప్రధాన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను 10న అనంతపురం వేదికగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలో భాగంగా పెద్ద ఎత్తున మెగా డీఎస్సీ నిర్వహించడం జరిగిందని, ఇప్పటికే ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చామన్నారు సీఎం.
పేదవాడికి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకూ 5.6 కోట్ల భోజనాలు అన్నార్తుల కడుపు నింపాయన్నారు సీఎం. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా పేద ధనికా అనే తారతమ్యం లేకుండా 5 కోట్ల మంది ప్రజలకు వర్తింప చేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు చంద్రబాబు నాయుడు. రూ.25 లక్షల వరకూ వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించామన్నారు.
సంక్షేమాన్ని అభివృద్ధిని కలగలిపి పాలన చేస్తూ ఇప్పటికే సంక్షేమంపై రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. గత పాలకులు ఐదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పుకుంటుంటే.. కేవలం 15 నెలల కాలంలోనే రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.