బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఊరుకోం
హైదరాబాద్ : బలవంతపు వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ట్రాన్స్ జెండర్లను ఉద్దేశించి సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. కేసులు నమోదు చేస్తే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు.
ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా చెప్పారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చని ఆమె అన్నారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పక తీసుకోవాలని సూచించారు . ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.






