ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని రచయిత శ్రీ రమణ దీక్షితులు పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్బంగా శ్రీ రమణ దీక్షితులు చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు టీటీడీ చైర్మన్. ఎన్నో ఏళ్లుగా కలియుగ దైవమైన, కోట్లాది మంది భక్తులను కలిగిన దేవ దేవుడు, శ్రీ కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులుగా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయనకు ఈ ఆలయం పట్ల అపారమైన అవగాహన, అనుభవం ఉందన్నారు బీఆర్ నాయుడు. రాబోయే రోజుల్లో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. నిత్యం తిరుమలను సందర్శించే భక్తులకు ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.






