కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ : సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రెండో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన మీడియాతో మాట్లాడారు . ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు, ఫలితాల తర్వాత తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక మండల అధ్యక్షుడు సాయిబాబా ట్రాక్టర్‌తో అక్కడకు వచ్చి బీభత్సం సృష్టించారని అన్నారు కేటీఆర్. వారిపై ట్రాక్టర్ ఎక్కించాడని, దీంతో ఈ దాడిలో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజుతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారని అన్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పార్టీ వారికి అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎస్పీకి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. సోమార్‌పేట్ ఘటనను వివరించి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు హత్యాయత్నాలకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.






