ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా
విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి . ఆయనను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. పూజలలో పాల్గొంటారు. స్వామి వారి సన్నిధిలో పూజలు చేస్తే తమ కష్టాలు తీరి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా. ఇదిలా ఉండగా ప్రముఖ నటి శ్రీలీలతో పాటు కుటుంబీకులు కూడా సింహాచలం అప్పన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.
కప్పస్తంభ మాలింగనం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం పొందారు. ఆలయ అధికారులు తనకు స్వామి వారి చిత్ర పటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. స్వామి వారంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ పూజలు చేయాలని తాను అనుకుంటూ వచ్చానని చెప్పారు నటి శ్రీలీల. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండడం వల్ల తన మొక్కును తీర్చుకోలేక పోయానని చెప్పారు. చివరకు ఇవాల్టితో ఆ మొక్కు తీరి పోయిందన్నారు. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాక తనకు ఎంతో ప్రశాంతత చేకూరిందని, ఇక్కడి మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు నటి శ్రీలీల.






