స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో చోటు చేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పెద్ద ఎత్తున ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని కోరారు. అయితే సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్ 30 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు . ఈసారి డిప్ సిస్టమ్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలకు టోకెన్లు కేటాయించడం జరిగిందన్నారు. దీని వల్ల రద్దీ తక్కువ అవుతుందని తెలిపారు.
ఈ ఎనిమిది రోజుల పాటు కేవలం సామాన్య భక్తులకే దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు బీఆర్ నాయుడు. ప్రముఖులు , ప్రోటోకాల్ కలిగిన వారు ఎవరైనా స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. లేకపోతే అందరితో పాటు వారు కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా అన్ని సేవలను, సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదన్నారు. బ్రేక్ దర్శనాలను ర్దదు చేశామన్నారు. ఇవాళ 50 అజెండా అంశాలతో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుందని చెప్పారు బీఆర్ నాయుడు. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల రూ.9 కోట్ల విరాళం అందిందని తెలిపారు. ఆలయ ధ్వజ స్తంభాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకానికి ప్రణాళిక రూపొందించామన్నారు. పలమనేరులోని టీటీడీ గోశాల ప్రాంగణాన్ని ఇందుకు అనువైన స్థలంగా గుర్తించామని చెప్పారు. భక్తుల అవసరాలకు సరిపడా బ్లేడులను ప్రముఖ తయారీ సంస్థ 17వ తేదీన విరాళంగా అందజేయనుందని వెల్లడించారు టీటీడీ చైర్మన్.






