
కూటమి సర్కార్ నిర్వాకం దారుణం
కర్నూలు జిల్లా : ఉల్లి రైతులకు బాసటగా నిలిచారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ సందర్బంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఉల్లికి గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు. ఉల్లి రైతులకు వెంటనే క్వింటాలుకు రూ. 2500 గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయంటూ వాపోయారు. పెట్టిన పెట్టుబడి మందం కూడా రైతుకి దక్కడం లేదన్నారు. ఒక్కో రైతుకి ఎకరాకు 80 నుంచి 1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుందన్నారు.
కానీ మార్కెట్ లో క్వింటాలుకు 600 రూపాయలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. గత ఏడాది ఇదే మార్కెట్ లో క్వింటాలుకు 4500 ధర పలికిందన్నారు. ఇప్పుడు 300 రూపాయలకు ఇస్తారా అని అడగడం దారుణం అన్నారు. ఉల్లికి మద్దతు ధర లేక ఇద్దరు రైతులు ఆత్మహత్య హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆ రైతులకు YCP రైతులు అని రాజకీయం పులిమి కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదేమి రాజకీయం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పండించిన పంటకు రాజకీయం కూడా ఉంటుందా అని నిలదీశారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. ఉల్లి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ధర 1200 వందలు అని చెప్పి మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపించారు.