
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ సంఘం
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. దసరా లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దసరా తర్వాత భువనగిరిలో లక్ష మంది తో బీసీల రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహిస్తామని ప్రకటించారు. యుద్ధభేరి సభ ద్వారా బీసీల రాజకీయ శక్తిని చాటుతామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బిజెపి నే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. అటు రాష్ట్రపతి భవన్ ను ఇటు రాజభవన్ ప్రభావితం చేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కారణంగానే అటు ఢిల్లీ లో, ఇటు గల్లీలో రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కలగడం లేదని సంచలన ఆరోపించారు.
ఒకరిద్దరు వ్యక్తులకు పదవులు ఇవ్వడం వల్ల న్యాయం జరగదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు పెంచి బీసీ వ్యవస్థకు మేలు చేయాలన్నారు. గత 22 నెలలుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసగించడం సహించలేకే రాజకీయ యుద్ధ బేరికి పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన గడ్డమీది నుండే బీసీల రాజకీయ పోరాటాన్ని మొదలు పెడుతున్నామని ప్రకటించారు. సోమవారం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన బిసీ కుల సంఘాల మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు, గత 22 నెలలుగా బీసీలు రిజర్వేషన్లు పెంచాలని పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని, బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చేది లేదని అనడం దారుణమన్నారు.