శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు
తిరుమల : అస్సాం సర్కార్ కీలక ప్రకటన చేసింది. టీటీడీ చైర్మన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 10 ఎకరాలకు బదులు 25 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వా శర్మ ఓకే చెప్పారని ఆ రాష్ట్ర సీఎస్ లేఖ ద్వారా టీటీడీకి తెలియ చేశారు. ఈ విషయాన్ని చైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో శ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ, సిల్చార్ లేదా డిబ్రూగఢ్ బదులుగా అస్సాం రాజధాని గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయించాలని ఏపీ సీఎం కోరారు. ఈశాన్య భారతదేశానికి గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్నందున, భక్తుల సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటి ధార్మిక కార్యక్రమాలతో కూడిన దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించాలని సిఫార్సు చేశారు. అలాగే ప్రతిపాదిత స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అస్సాం ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించాలని ఏపీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు అంగీకరించారు. ఈ అంశాన్ని సౌహార్దపూర్వకంగా పరిష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ , అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసి, ఈశాన్య భారతదేశంలో తొలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అస్సాం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.








