కడప గడపలో ఈనెల 27 వ తేదీ వరకు ఉత్సవాలు
తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు( ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు రాత్రి 08.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 19వ తేదీన ఉదయం ధ్వజారోహణం (మీన లగ్నం) , రాత్రి చంద్రప్రభ వాహనం , 20న ఉదయం సూర్యప్రభ వాహనం ,రాత్రి పెద్దశేష వాహనం, 21న ఉదయం
చిన్నశేష వాహనం ,రాత్రి సింహ వాహనం, 22న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 23న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం జరగనుందని టీటీడీ తెలిపింది.
ఉత్సవాలలో భాగంగా 24న ఉదయం కల్యాణోత్సవం , రాత్రి గజ వాహనం, 25న ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 26న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం, 27న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి హంసవాహనం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.







