
ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అభినందనలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిరాయ్. ఆశించిన దానికంటే ఎక్కువగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు తేజ సజ్జా. శ్రేయ శరణ్, జగపతి బాబు, మంచు మనోజ్ ఇతర పాత్రలలో జీవించారు. శుక్రవారం విడుదలైంది. మంచి మార్కులు పడ్డాయి. ఉత్కంఠ భరితంగా, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ సందర్బంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కరొక్కరు సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన ఆర్జీవీ ఉన్నట్టుండి తన స్పందనను తెలిపారు.
ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు మిరాయ్ గురించి. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని, నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ లకు ప్రత్యేక అభినందనలు. బాహుబలి తర్వాత నేను మరే ఇతర చిత్రానికి మిరాయ్ కి ఇంతటి ఏకగ్రీవ ప్రశంసలు వినలేదని పేర్కొన్నాడు దర్శకుడు. ప్రధానంగా వీఎఫ్ఎక్స్ , కథనం రెండూ హాలీవుడ్ ప్రమాణాలకు సరిపోయేలా ఉన్నాయని ప్రశంసలు కురిపించాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ మిరాయ్ సినిమాకు మరింత బలాన్ని కలిగించేలా చేసింది. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు నటుడు, దర్శకుడు, నిర్మాతలు.