రేవంత్ రిజైన్ చేస్తే నేను సీఎంనవుతా
కాళేశ్వరం మరమ్మత్తు చేసి చూపిస్తా
హైదరాబాద్ – మాజీ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్న సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. బుధవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ నేతలను నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజా ప్రతినిధులను గౌరవించడం అనేది సంప్రదాయమని, దానిని తుంగలో తొక్కారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పైకి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తామని చెబుతూనే ఇంకో వైపు తమను మాట్లాడ నీయకుండా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు హరీశ్ రావు.
తాను సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఒకవేళ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైతే తాను ముఖ్యమంత్రిగా కూర్చుంటానని, కాళేశ్వరం కథ ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధులను మీడియా పాయింట్ కు రానివ్వక పోవడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు.