స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా : సోమశిల పర్యాటక ప్రాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన కొల్లపూర్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు బోటులో విహరించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది, ప్రకృతి అందాలను వీక్షించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అక్కడి ప్రకృతి అందాలను, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించానని తెలిపారు.
సోమశిల – శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. ఇక్కడి వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టి పడేస్తాయని అన్నారు. ముఖ్యంగా ఎకో పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడి పర్యాటకానికి మరింత ఆకర్షణను తెస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు, దేశ విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా సోమశిలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
సోమశిల ప్రాంతం కేవలం విహారకేంద్రంగానే కాకుండా 15 శివాలయాల సముదాయంతో ఆధ్యాత్మిక క్షేత్రంగానూ అలరారుతోందని అన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) సోమశిల నుండి శ్రీశైలం వరకు ఐదు గంటల పాటు సాగే ప్రత్యేక బోటింగ్ సేవలను అందిస్తోందని చెప్పారు. ఈ ప్రయాణంలో నదీ తీర అందాలను చూస్తూ సాగే ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుందని అన్నారు.






