
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్
అమరావతి : రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెర తీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో జగన్నాటకానికి తెర తీశాడన్నారు. ఈ మేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం జగన్ దన్నారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని, తన నివాసం ఇక్కడే ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడన్నారు. అధికారంలోకి రాగానే, మాట మార్చేసి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర తీశాడని ఆరోపించారు. అయిదేళ్లలో ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా, రాజధాని లేని రాష్ట్రానిగా ఏపీని భ్రష్టు పట్టించాడరన్నారు. అమరావతిని స్మశానమని, మునిగి పోయే ప్రాంతమని చులకన చేసి జగన్ సహా వైసీపీ నాయకులంతా మాట్లాడారన్నారు.
ఆంధ్రుల చిరకాల కల అయిన అమరావతి కోసం భూములిచ్చిన రైతులను, మహిళలను పెయిడ్ ఆర్టిస్టులంటూ హేళన చేశారన్నారు. వారిని నిర్బంధాలకు గురిచేస్తూ పోలీసులతో కొట్టించారన్నారు. జగన్ అరాచక పాలనతో విసిగి పోయిన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఛీ కొట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. అయినా , ఇంత జరిగినా జగన్ కు , ఆయన పరివారానికి బుద్ది రాలేదన్నారు మంత్రి ఎస్ .సవిత. నిన్నగాక మొన్న తన నీలి మీడియాలో అమరావతి వేశ్యల నగరమంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా తప్పుడు మాటలు మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇన్ని విధాలా అమరావతిపై విషం కక్కిన జగన్..ఇపుడు రాజధానికి అనుకూలమంటూ చెప్పడం మరో జగన్నాటకానికి తెర తీయడమేనన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోడానికి జగన్ రెడ్డి ఆడుతున్న రివర్స్ డ్రామా అని మంత్రి సవిత మండిపడ్డారు. అయితే కాళ్లు పట్టుకోవడం, లేకుంటే జుట్టు పట్టుకోవడం జగన్ కు అలవాటేనన్నారు. జగన్ ఎన్ని రివర్స్ డ్రామాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, తమ కలల రాజధాని సాకారమవుతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు.