
తిరుమలలో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల : టీటీడీ ఈవోగా రెండోసారి కొలువు తీరిన సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ హల్ చల్ చేస్తున్నారు. తానేమిటో మరోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. నిరంరతం సమీక్షలతో ఉద్యోగులలో మరింత బాధ్యతను పెంచేలా చూస్తున్నారు. తాజాగా తిరుమల ఆలయ ప్రాంగణంలో , పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను వీక్షించారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మరింత పనితీరు మెరుగు పర్చుకునేలా చూడాలని స్పష్టం చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆయన మరింత తిరుమలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అత్యంత నిజాయితీ పరుడైన అధికారిగా పేరు పొందారు.
టీటీడీ ఆలయ చరిత్రలో ఏ ఈవోకు ఇలాంటి అరుదైన అవకాశం రానే లేదు. దీనికి కారణం ఆయన పనితీరు మరింత ఆకట్టుకునేలా చేసింది సీఎంను. దీంతో రెండోసారి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా తనకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే తనదైన ముద్ర కనబర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఈ సందర్భంగా రియల్ టైమ్‌లో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించాలని ఆదేశించారు. ఎల్ అండ్ టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు.
అనంతరం ఈవో లగేజీ కౌంటర్‌ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తైన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు. భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టి.రవికి సూచించారు.