
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
తిరుపతి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం సరే మరి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలపై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆలోచించాలని సూచించారు. ఆదివారం తిరుపతి వేదికగా జరిగిన మహిళా ప్రజా ప్రతినిధుల సాధికారితా సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని, శాసనసభలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన దూరదృష్టి గల నేతగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అదే విధంగా స్వయం సహాయక బృందాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, మహిళా ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు కృషిని ఆయన ప్రస్తావించారు. 1999లో రాష్ట్ర తొలి మహిళా స్పీకర్‌గా ప్రతిభాభారతిని ఎన్నుకోవడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజలు మన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్నారు స్పీకర్. ప్రజా ప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు వర్తించే No Work, No Pay సూత్రం ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదన్న ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలోని అసెంబ్లీలు ఏడాదిలో కనీసం 60 రోజులు సమావేశాలు జరపాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు.