
సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
అస్సాం : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి దాయాది పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరి పారేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారత్ సత్తా ఏమిటనేది ఇప్పటికే పాక్ కు తెలిసి పోయిందన్నారు. కానీ ఇంకోసారి గనుక తోక జాడిస్తే తాట తీస్తామన్నారు. ఇదే సమయంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా మద్దతు ఇస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం అస్సాంలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
గోలాఘాట్‌లో పాలీప్రొఫైలిన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించారు. కాంగ్రెస్ దేశ సైన్యానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా, పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అస్సాంలోని దరంగ్ జిల్లాలోని మంగళ్‌దోయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. చొరబాటుదారులతో పాటు దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి. చొరబాటుదారులను భూమిని ఆక్రమించు కోవడానికి, జనాభాను మార్చడానికి, కుట్ర చేయడానికి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిన మన సాయుధ దళాలకు మద్దతు ఎందుకు ఇవ్వలేక పోయిందంటూ ఆయన సూటిగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.