గెలిపిస్తే రూ. 5 వేల కోట్లు ఇస్తా
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
కోడంగల్ (కోస్గి) – సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కోడంగల్ నియోజకవర్గానికి ఏకంగా రూ. 5,000 కోట్లు ప్రకటించారు. ఇది ఓ సంచలనంగా మారింది. 50 వేల మెజారిటీతో గెలిపిస్తే తాను మరో 5 వేల కోట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమన్నారు.
విద్యార్థుల యూనిఫాంల తయారీ ఎస్‌హెచ్‌జీలకు అప్పగిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనిస్తామని చెప్పారు. పంటల కొనుగోళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు సీఎం. స్వయం సహాయక సంఘాల మహిళలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రూ.2945.50 కోట్లతో కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో మొత్తంగా రూ.4369.143 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, పారా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు, రహదారులు, వంతెనలు ఇతర అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కోస్గిలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఆయా సంఘాల మహిళలతో సమావేశమయ్యారు. పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే అవకాశాన్ని ఇస్తామన్నారు.
గతంలో కొడంగల్ ప్రాంతంలోని ఎస్‌హెచ్‌జీ మహిళలు కందులు కొనుగోలు చేసి నష్ట పోయారని, దాని నుంచి తేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో పంటల కొనుగోళ్లను సంఘాల ద్వారానే కొనుగోలు చేయిస్తామని, ఈ క్రమంలో ఆయా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.