కీలక వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ
నాగర్ కర్నూల్ జిల్లా : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల పరిధిలోని తుమ్మన్ పేట. ఇటీవలే ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఓ హోటల్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన స్వంత ఊరుకి వచ్చారు. ఇటీవలే భారీ ఖర్చుతో స్వంత ఊరులో నిర్మించుకున్న ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా 2 వేల మందికి పైగా గ్రామస్థులు, ప్రముఖులకు గ్రాండ్ గా విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు విజయ్ దేవరకొండ. సొంతూరుతో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉందన్నారు. ఊరిలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తామన్నారు. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తామని ప్రకటించారు. ఈ ఊరికి చేసేది చాలా ఉందన్నారు. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని వెల్లడించారు విజయ్ దేవరకొండ.







