
రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. గ్రూప్ -1 పరీక్షల విషయంలో హైకోర్టు చెంపపెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అప్పీల్‌కు వెళ్లి పెద్ద, పెద్ద లాయర్లను పెడతామని ప్రభుత్వం అంటే విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం నేతలు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే అడ్డుకుని పోలీసులు అరెస్టులు చేశారని ఆరపించారు. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు గుత్తేదారా అని నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనంతకు తానుగా హిట్లర్ ను , ముస్సోలినీనని భావిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో రాచరిక, నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. 563 ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున గ్రూప్ -1 రాసిన పరీక్షలు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అయినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. విద్యార్థి నాయకులపై రౌడీ పాలన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ప్రకటించారు. విద్యార్థులు అనుమతి తీసుకుని పెట్టుకున్న రౌండ్ టేబుల్ మీటింగ్‌ను పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన తెస్తామన్నది ఇదేనా అని మండిపడ్డారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. అన్ని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చర్చ పెట్టి తీరుతామని, ఎలా అడ్డుకుంటారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు.