
ఈ దేశంలో లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సర్కార్. ప్రత్యేకించి అయితే అంబానీ లేదంటే అదానీ జపం చేస్తూ వస్తున్న క్రమంలో మరో భారీ మోసం తెర మీదకు వచ్చింది. ఆక్షాత్తు ప్రజా దేవాలయంగా భావించే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి రిలయన్స్ గ్రూప్ కు చెందిన అనిల్ అంబానీ ప్రజా ధనం లూటీ చేసిన మోసం ఏకరువు పెట్టారు. ఇది వాస్తవమేనంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశాన్ని కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేసి..అర చేతిలో స్వర్గం చూపించి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినా, ఇంటర్ పోల్ కు సమాచారం అందించినా వాళ్లను ఈ దేశానికి రప్పించలేక పోతున్నారు. ఇది మన ప్రభుత్వ చేతకాని తనమా లేక ఉదాసీన వైఖరా అన్నది సర్కార్ కే తెలియాలి. ప్రజలు కష్టపడి దాచుకున్న ప్రభుత్వ బ్యాంకులనే ఈ కార్పొరేట్ మోసగాళ్లు వేల కోట్లకు టోకరా పెట్టారు. దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ చట్టాల లోని లొసుగులను ఆసరాగా చేసుకుని పేట్రేగి పోతున్నారు.
తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధీరూభాయ్ అంబానీకి చెందిన ఇద్దరు తనయులలో ఒకడైన అనిల్ అంబానీ రుణాల పేరుతో ఏకంగా రూ. 17,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తను తప్పించు కోకుండా, ఇతర దేశాలకు పారి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రాహుల్ గాంధీ పదే పదే గొంతు చించుకుని పార్లమెంట్ సాక్షిగా అరుస్తున్నాడు. తనను పిచ్చోడిని చేశారు..ఆపై మోదీ నవ్వుతూనే ఉన్నాడు. బడా బాబులకు వంత పాడుతూ ఉంటే, మరో వైపు ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్న రుణాలను మాఫీ చేసుకుంటూ పోతోంది. ఈ బీజేపీ సర్కార్ వచ్చాక లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనం ఆవిరై పోయింది. అంటే తీసుకున్న రుణాలను కట్టకుండా ఉన్న రుణగ్రహీతలకు మేలు చేసేలా మాఫీ చేసింది. రాజ్యాంగం అన్నది బలంగా లేక పోయి ఉండి ఉంటే అన్ని బ్యాంకులను ధారాదత్తం చేయడమో లేక రాసి ఇచ్చేదేమో నిర్మలా సీతారామన్.
ఓ వైపు ముఖేష్ అంబానీ సంపద రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అనిల్ అంబానీ తన కంపెనీల పేరుతో అడ్డగోలుగా రుణాలు తీసుకుంటూ కట్టకుండా ఎగవేసేందుకు ప్లాన్ చేసినట్లు ఈడీ జరిపిన దాడుల్లో తేలింది. అంతే కాదు తనను మోస పూరితమైన ఖాతాదారుడి కింద రుణాలు ఇచ్చిన అన్ని బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. ఆర్బీఐకి ఫిర్యాదు చేశాయి. కేంద్ర విత్త మంత్రికి తెలియ పరిచాయి. అనిల్ అంబానీకి సంబంధించి ప్రశ్నార్థకమైన ఆర్థిక లావాదేవీలు, నియంత్రణ లోపాలతో పాటు బ్యాంకింగ్ , న్యాయ వ్యవస్థలో వ్యవస్థాగత వైఫల్యం మరింత మోసానికి పాల్పడేలా చేసింది. ఇక అనిల్ అంబానీ కంపెనీలు భారతీయ, విదేశీ బ్యాంకుల నుండి ఏకంగా రూ. 48, 216 కోట్లకు పైగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. చివరకు ఈ రుణాలు ఎన్పీఏలుగా మారాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మోస పూరితమైనవిగా పేర్కొంది. ఈ తరుణంలో కొన్నింటిని తన సోదరుడు ముఖేష్ అంబానీకి అప్పగించారు తెలివిగా. కెనరా బ్యాంకు భారీగా రుణాలు ఇచ్చింది. తనను దివాలా తీసినట్లు ప్రకటించింది. రిలయన్స్ ఏరోస్పేస్ వంటి బిగ్ వెంచర్లలో అనిల్ అంబానీ సంబంధం కలిగి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదే సమయంలో గత జూన్ 30వ తేదీన అనిల్ అంబానీకి ఎస్బీఐ నోటీస్ జారీ చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కామ్ ) రుణ ఖాతాను మోస పూరితమైనదిగా ప్రకటించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ అంబానీ తరపు న్యాయవాది తప్పు పట్టారు. తాను ప్రజా ధనాన్ని దోచుకున్నట్లు చిత్రీకరించారని, తాను మోసగాడినంటూ ఎలా ప్రకటిస్తారంటూ తిరిగి ఫైర్ కావడం విస్తు పోయేలా చేసింది. గత ఏడాది 2024 నవంబర్ లో కెనరా బ్యాంకు అనిల్ అంబానీ ఖాతాను మోస పూరిత ఖాతాగా ప్రకటించింది. అంబనీ ఆర్ కామ్ , ఆర్ఐఎల్ కంపెనీలు 2015లో ఎస్బీఐ, ఇతర దేశీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుండి రుణాలు పొందాయి. ఎస్బీఐ రూ. 3628.68 కోట్లు రుణంగా ఇచ్చింది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా రూ. 1832.91 కోట్లు అప్పుగా ఇచ్చింది.
పేద, మధ్యతరగతి ఖాతాదారులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు విధించే బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా ఎలా మంజూరు చేస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక అనిల్ అంబానీకి రుణాలు ఇచ్చిన బ్యాంకుల లిస్టు బాగానే ఉంది. ఇందులో కెనరా బ్యాంకు, యూబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, శభా హోల్డింగ్స్ , దోహా బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఎస్ లి లోవి అసెస్ మేనేజ్ మెంట్, ఎమిరేట్స్ బ్యాంకు, చైనా డెవలప్ మెంట్ బ్యాంకు, ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా, తదితర బ్యాంకులు, రుణ సంస్థలు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ. 48 వేల కోట్లకు పైగా సామాన్యుల డిపాజిట్లను దోచుకున్నాడు. నకిలీ పత్రాలు సమర్పించి రుణాలు పొందినట్లు తేలింది.
దీంతో ఆర్బీఐ డిసెంబర్ 5, 2020న అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రా టెల్ ను రద్దు చేసింది. దీనిని దివాలా కింద వేలం నిర్వహించారు. దీనిని తన సోదరుడు ముఖేష్ అంబానీ తీసుకున్నాడు.
ఇదే సమయంలో చైనాకు చెందిన మూడు బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా, సీడీబీ నుంచి రుణాలు తీసుకున్నాడు. ఆ రుణాలు ఎన్పీఏగా మారడంతో తిరిగి పొందేందుకు , వసూలు చేసేందుకు గాను యుకె కోర్టులో కేసులు దాఖలు చేశాయి. విచారణ జరిపిన లండన్ కోర్టు చైనా బ్యాంకులకు 717 మిలియన్ యుస్ డాలర్లు అంటే రూ. 5,448 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే తన వద్ద ఏమీ లేదంటూ బుకాయించాడు. తను తెలివిగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అక్టోబర్ 12, 2020న చైనా బ్యాంకులకు నోటీసులు పంపింది. తనపై వేసిన దివాలా కేసును సవాల్ చేస్తూ. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. పలు కంపెనీలపై దాడులు చేపట్టింది. పత్రాలను స్వాధీనం చేసుకుంది. తను పారి పోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది..రుణాలను మాఫీ చేస్తుందా లేక చర్యలు తీసుకుంటుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.