ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలని తమపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రధానంగా బీఆర్ఎస్ , బీజేపీ నాయకులు స్థాయిని మరిచి పోయి అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. నాలుగున్నర కోట్ల ప్రజానీకం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడిందని , ఆ మాత్రం గౌరవం లేకుండా కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని చెప్పడం దారుణమన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అవగాహన లేని వాళ్లే అలా కామెంట్స్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు భట్టి.
గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని , కానీ ఇప్పుడు తాము వచ్చాక భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందజేస్తామని చెప్పారు.