
బాధితుడు జెరూసేలం ముత్తయ్య కామెంట్స్
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తి జెరూసేలం ముత్తయ్య నోరు విప్పాడు. వాస్తవాలు ఏమిటో తాను చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు. బుధవారం మీడియా ముందుకు వచ్చాడు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించాడు. ఓటుకు నోటు నిజాలు ఏమిటో సుప్రీంకోర్టుకు వెళ్లడిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తనను స్టీఫెన్స్ వద్దకు పంపింది ఎవరో చెబుతానని న్నారు. తాను దోషిని కాదని బాధితుడినంటూ వాపోయాడు ముత్తయ్య. ఇరికించిన వాళ్లు, ఇరికిన వాళ్లు బాగున్నారని, కానీ నా బతుకే ఆగమైందన్నారు. ఆ కేసు కారణంగా తన ఫ్యామిలీ అన్యాయమైందన్నారు. ఈడీ వాళ్లు వేధించారని వాపోయాడు ముత్తయ్య.
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తనను వేధించిందని, రేవంత్‌రెడ్డి నా కుటుంబానికి ఎలాంటి సాయం చేయలేదన్నారు. తాను ఎవరి ప్రలోభాలకూ గురి కాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాపేరు ఇంకా ఎందుకు కొనసాగిస్తుందో తెలియడం లేదన్నారు. ఆనాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తనను మానసికంగా వేధించిందన్నారు. నా కుటుంబాన్ని హింసించిందన్నారు. తన సోదరుడిని క్రూరంగా హింసించిందని వాపోయారు. నన్ను టార్చర్ చేశారు. అయినా రేవంత్‌రెడ్డి నా కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ఏసీబీ కోర్టు విచారణకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. అదీ నా నిబద్ధత అని స్పష్టం చేశారు ముత్తయ్య.
ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో నేను సుప్రీంకోర్టుకు పూసగుచ్చినట్లు వివరిస్తా. నన్ను స్టీఫెన్స్ దగ్గరకు ఎవరు పంపారో, నన్ను ఎవరు పావుగా వాడుకున్నారో కూడా చెబుతా. ఇప్పటికే చాలా నష్టపోయా కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదన్నారు .