
తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా
హైదరాబాద్ : అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తూ, సర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కలెక్టర్ ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడింది. ఈ మేరకు సీరియస్ గా కామెంట్స్ చేస్తూనే వారెంట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమైన భూమి నిర్వాసితుడికి పరిహారం చెల్లించాలని విచారణ సందర్బంగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది హైకోర్టు. అయితే ఆ ఆదేశాలను పక్కన పెట్టారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. దీంతో తన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు కలెక్టర్ పై హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఎందుకు ఆదేశాలు అమలు చేయలేదనే దానిపై కూడా సందీప్ కుమార్ ఝా వివరణ కూడా ఇవ్వక పోవడం పట్ల తీవ్రంగా స్పందించింది కోర్టు. ఇది అత్యంత బాధ్యతా రాహిత్యం అంటూ ఫైర్ అయ్యింది. విచారణకు హాజరు కాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలకు ఆదేశించింది.
ఈ కేసు చీర్లవంచకు చెందిన భూమి నిర్వాసితుడైన వేల్పుల యెల్లయ్యకు సంబంధించింది. అతను మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో తన ఇంటిని కోల్పోయాడు. జిల్లా యంత్రాంగం తనకు తగిన పరిహారం అందించడంలో విఫలమైనందున కోర్టును ఆశ్రయించాడు.