
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత తగ్గినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. జనహిత పాదయాత్ర పేరుతో పరిగి నుంచి ప్రారంభించడం ఒకింత విస్తు పోయేలా చేసింది. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడంలో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఏకంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, ప్రయోజాల కోసం మాత్రమే ఢిల్లీకి వెళుతున్నానని వెల్లడించాడు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఎలాంటి ప్రయోజనం కలిగిందో, ఎన్ని నిధులు తీసుకు రాగలిగారనేది ఇప్పటి వరకు చెప్పలేక పోయారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి పాలనను చూడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక్క ఉచిత బస్సు పథకం తప్పిస్తే. మిగతా పథకాలు ఏవీ వర్కవుట్ కాలేదు. వీటిని అమలు చేయాలంటే ఈ దేశ బడ్జెట్ కూడా సరిపోదని తెలంగాణ ప్రాంతానికి చెందిన మేధావులు పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దొరల పాలన సాగించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సీఎంగా కొలువు తీరాక కూడా తన మాట, పని తీరును మార్చుకోలేక పోయారు. ప్రజలు , సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన స్థాయిని మరిచి పోయి కామెంట్స్ చేయడం కలకలం రేపింది. కీలకమైన శాఖలన్నీ తన వద్దనే ఉండగా, మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండడం పార్టీకి, హై కమాండ్ కు తలకు మించిన భారంగా మారింది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి దూకుడు ఏకంగా పార్టీ పెద్దలను దాటేసే విధంగా ఉండడంతో ముందుగా గుర్తించింది అధిష్టానం. మెలమెల్లగా చెక్ పెడుతూ వచ్చింది. తనకు సపోర్ట్ చేసే వారిని మెల మెల్లగా దూరం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ప్లాన్ ను అమలు చేయడంలో ఫోకస్ పెట్టింది. రాహుల్ గాంధీ దూతగా మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చారు.
మరో వైపు సర్కార్ చేపట్టిన కుల గణన సర్వే , బీసీ రిజర్వేషన్ బిల్లు రెండూ తమవేనని చెప్పుకుంటున్నా వాస్తవానికి ఈ రెండింటిపై బీసీ సామాజిక వర్గాలు భగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన పోస్టులలో, నామినేట్ పదవుల్లో, కేబినెట్ లో , చివరకు అన్ని శాఖలు, సంస్థలలో అత్యధికంగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి దక్కడం పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బీసీలు రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. దీంతో పార్టీకి, సీఎంకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఈ తరుణంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి పాదయాత్రకు పిలుపు ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఈ యాత్రకు సంబంధించి ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. తనకు రాహుల్ గాంధీ టైం ఇవ్వక పోవడం కూడా ఒక రకంగా మైనస్ పాయింట్ గా మారిందన్న ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిన పడలేదు. తెలంగాణేతరులు , ఏపీకి చెందిన వారు, టీడీపీ నుంచి జంప్ అయిన వారే ఇప్పుడు రేవంత్ ఇలాఖాలో హవా చెలాయించడం పట్ల తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఈ తరుణంలో జనయాత్ర చేపట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా నటరాజన్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తయారైంది పార్టీ పరిస్థితి. రాబోయే రోజుల్లో ఎవరిది పై చేయిగా మారుతుందో వేచి చూడాలి.