
అందరి కళ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై పడ్డాయి. గత కొన్నేళ్లుగా దీని నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఈ సంస్థపై ఆధిపత్యం చెలాయించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ రాజకీయాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. కోర్టు కేసుల దాకా వెళ్లింది. ఎవరు హెచ్‌సిఏకు అధ్యక్షుడైనా, కొత్త కార్యవర్గం కొలువు తీరినా సీన్ మారలేదు. పలు రాష్ట్రాలలో క్రికెట్ అసోసియేషన్ లు ఉన్నాయి. కానీ హెచ్‌సిఏపై ఆరోపణలతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. గతంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ అజహరుద్దీన్ ఉన్నా దీని పనితీరు మారలేదు. పైగా తనపై కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తో జగన్ మోహన్ రావు ఎన్నికయ్యాడు. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనికి ఆజ్యం పోసింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) . సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంకు ప్రెసిడెంట్ కు మధ్య టికెట్ల వివాదం రాజుకుంది. చివరకు టికెట్ల జారీ విషయంలో తమను బెదిరింపులకు గురి చేశారంటూ ఏకంగా యాజమాన్యం బీసీసీఐకి, ఐపీఎల్ చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ హెచ్ సీ ఏపై సిట్ ను ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే నెపంతో ఈడీ రంగంలోకి దిగింది.
పెద్ద ఎత్తున మోసం జరిగినట్లు, డబ్బులు దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఆధారాలను సేకరించింది. ఐపిఎల్ టికెట్ స్కామ్ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్ సీఏ లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ రాష్ట్ర సర్కార్ కు నివేదిక సమర్పించింది. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, కోశాధికారి సీజే శ్రీనివాస్ , సీఈఓ సునీల్ కాంటేలను అరెస్ట్ చేసింది. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, నేర పూరిత నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు పేర్కొంది. వీరిపై కేసులు నమోదు చేసింది. 2023లో జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో నకిలీ పత్రాలు సృష్టించి ప్రెసిడెంట్ గా పోటీ చేశారంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.
అదనపు టికెట్లు కావాలంటూ హెచ్ సీ ఏ యాజమాన్యాన్ని జగన్ మోహన్ రావు అండ్ టీం బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆనాటి ఎన్నికల్లో జగన్ మోహన్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీశ్ రావు పూర్తిగా సపోర్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సన్ గ్రూప్ యాజమాన్యంలోని ఎస్ ఆర్ హెఎచ్ సీరియస్ ఆరోపణలు చేసింది హెచ్ ఏసీ పై. ఏకంగా తమ ఫ్రాంచైజీని ఇక్కడి నుంచి తరలిస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ మొత్తం తతంగంపై సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అవకతవకలు జరిగాయని పరిపాలనా పరంగా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. టికెట్ల వ్యవహారంలో ఎస్ ఆర్ హెచ్ కు స్టేడియంలోని కార్పొరేట్ బాక్సులలో ఒకదాన్ని లాక్ చేశారని , కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వక పోతే దానిని అన్ లాక్ చేసేందుకు నిరాకరించారని విచారణలో తేలింది.
ఇదే సమయంలో జగన్ మోహన్ రావు బెదిరింపులకు దిగాడని అంతే కాకుండా ఎస్ ఆర్ హెచ్, హెచ్ సీ ఏ , బీసీసీఐ మధ్య త్రిపక్ష ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపించింది. కాగా 3,900 కాంప్లిమెంటరీ టికెట్లను స్టేడియంలో సామర్థ్యం ఆధారంగా కేవలం 10 శాతం మాత్రమే కేటాయిస్తుంది. ఇది ఒప్పందంలో భాగంగా కూడా. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ చీఫ్ అజారుద్దీన్ కోరారు. తనపై కూడా కేసు నమోదైంది. టికెట్ల స్కాం తనను కలవర పెట్టిందన్నాడు. పూర్తిగా రద్దు చేయాలని కోరాడు. అవసరమైతే తాను బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దమన్నాడు.
తాజాగా ఈ కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, 2023 నుంచి 2025 వరకు వచ్చిన ఆదాయం, ఖర్చులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తోంది. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై సీఐడీ ఫోకస్ పెట్టింది. ఆర్థిక లావాదేవీలలో అక్రమాలను గుర్తించింది. ఈ రెండేళ్ల కాలంలో బీసీసీఐ నుంచి HCA కు రూ.257 కోట్ల నిధులు వచ్చాయి. అందులో రూ.97 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం హెచ్ సీఏ అకౌంట్‌లో రూ.37 కోట్లు ఉన్నట్టు గుర్తించింది. అయితే మిగతా రూ.123 కోట్లు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై దర్యాప్తు వేగవంతం చేసింది.
కాగా ఇప్పటి వరకు క్రికెట్ పరంగా అభివృద్ది చేసిన దాఖలాలు లేవు. తూతూ మంత్రంగా తప్పితే . హెచ్ సీఏకు సంబంధించి వందలాది క్రికెట్ క్లబ్ లు ఉన్నాయి. ఇవే సంస్థను శాసిస్తున్నాయి. క్రీడాకారుల ఎంపికలో సైతం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హెచ్ సీఏ నుంచి జాతీయ స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు లేరు. వాళ్లను తయారు చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉంది. కానీ ఎక్కడ లేని రాజకీయాలు దీనిని ఆవహించి ఉన్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కన్ను హెచ్ సీఏపై పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన కుటుంబానికి చెందిన వారిలో ఒకరికి లేదా తన పరివారంలోని వారికి అప్పగించాలని , ఇదే అదనుగా భావిస్తున్నట్లు టాక్. మొత్తంగా హెచ్ సీఏ అక్షయపాత్రగా మారింది. మరి హెచ్ సీఏ ఎవరి పరం అవుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.