నిప్పులు చెరిగిన సీఎం పినరయ్ విజయన్
కేరళ : తనతో పాటు కేరళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్. ఇటీవల కేరళ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే వ్యక్తి, కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మా సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు ఆయన కేవలం ఒక ప్రతినిధిగా మారిపోయారని పేర్కొన్నారు సీఎం.
విచిత్రం ఏమిటంటే కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఒక బంధం ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు సీఎం. ఆయన చేసిన ఆరోపణ హాస్యాస్పదం అని పేర్కొన్నారు. కేరళ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం ఆర్థిక దిగ్బంధం, రుణ పరిమితి కోతలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడ లేకపోయిన, వెన్నెముక లేని కాంగ్రెస్ పార్టీయే నిజానికి బీజేపీకి అసలైన ‘బి-టీమ్’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు పినయర్ విజయన్. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేరళ చేసిన తీవ్ర నిరసనలను ఆయన గమనించలేదా? లేక మన రాష్ట్రానికి తన పార్టీ చేసిన ద్రోహాన్ని ఆయన సమర్థించు కుంటున్నారా? అని ప్రశ్నించారు.





