కన్నెర్ర చేసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందారు. అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారని పేర్కొన్నారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం అని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదని వాపోయారు అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేదన్నారు.
సింగరేణి లో నుంచి బొగ్గు తీసేందుకు కార్మికులు ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని, అక్కడి గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బ్లాక్ అవుతుందని, కాళ్లు వంకర అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండటంతో వారికి మన కష్టాలు తెలియటం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు కల్వకుంట్ల కవిత.





