స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుల భద్రత, సకాలంలో అమలును నిర్ధారిస్తూనే, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తయారీ, సుస్థిర పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందనిపునరుద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశానికి అధ్యక్షత వహించారు.
రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పటిష్టమైన ట్రాన్స్‌మిషన్ మౌలిక సదుపాయాలను ప్రణాళిక చేసి, అభివృద్ధి చేయాలని అన్నారు. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ సహా పలు రంగాలలో మొత్తం రూ. 39,436.84 కోట్ల పెట్టుబడితో 31 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,11,278 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు సీఎం. రాయలసీమలో సోలార్ పార్కులను అభివృద్ధి చేసి, తదనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.





