
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత
ఢిల్లీ : బీసీ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి ఎస్. సవిత. అత్యధికంగా బీసీ యువతకు జాబ్స్ వచ్చాయి. ఈ సందర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు వరించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఎస్ . సవిత ప్రసంగించారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహించిన శిక్షణా కేంద్రాల్లో 1,674 మందికి, ఆన్ లైన్ ద్వారా మరో 4,774 మందికి ఇలా మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ అందజేశామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో శిక్షణ పొందిన వారిలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారన్నారు. విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ అందజేయగా, వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ – 1కు పది మంది ఎంపికైనట్లు చెప్పారు.
ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారన్నారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో మరో ఆరుగురు, ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికయ్యారన్నారు. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు మరికొందరు అర్హత సాధించారన్నారు. బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందజేసినందుకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు బీసీ సంక్షేమ శాఖకు ప్రకటించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. అవార్డు స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. రాబోయే కాలంలో బీసీ యువతకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు ప్రకటించారు.
అమరావతిలో అయిదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నామన్నారు. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన ఉందన్నారు. అంతకు ముందు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చార్, ప్రొఫెసర్ మహేందర్ దేవ్ చేతుల మీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఎస్.సవిత అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.