
అమ్మ వారిని దర్శించుకున్న హోం మంత్రి
విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్రసిద్ది చెందింది బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు. దసరా పండుగ సందర్బంగా సోమవారం నుంచి కొండపై దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇవాళ ప్రారంభమై వచ్చే అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి. రవాణా వ్యవస్థ పెద్ద ఎత్తున బస్సులను నడుపుతోంది. ఏపీటీడీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ బాబు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 29వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మ వారికి ప్రభుత్వ పరంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు అనిత. వేదపండితుల ఆశీర్వచనం అందుకొని భక్తులతో ముచ్చటించడం జరిగిందని తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేయడం తృప్తిని ఇచ్చిందని చెప్పారు.