
ప్రజలే చరిత్ర నిర్మాతలు. వాళ్లకు ఏ ఇబ్బంది కలిగినా నేను ఒప్పుకోను. కేపటలిజం ఇవాళ ప్రపంచాన్ని కబలించ వచ్చు కానీ రేపటి రోజున సోషలిజమే యావత్ మానవాళికి, ప్రపంచానికి మార్గం చూపుతుంది. అన్నం పండించే రైతుల కోసం నా శ్వాస ఉన్నంత వరకు మద్దతు ఇస్తూనే ఉంటాను. అధికారంలో ఉన్నా లేకున్నా నేను పోరాడుతూనే ఉంటాను. నిజం కోసం, సత్యం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇంకెన్ని ఇబ్బందులు వచ్చినా , చివరకు చావు పలకరించినా నేను సిద్దమై ఉంటాను. ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదు. పదవుల కంటే ప్రజలు, దేశమే గొప్పదని నేను నమ్ముతానంటూ స్వంత పార్టీలోనే ధిక్కార స్వరం వినిపించిన మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ ఇవాళ భారతీయ పుణ్యభూమి నుంచి నిష్క్రమించారు. సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఆయన సాగించిన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఉపయోగ పడుతుంది. తన పేరులో ఉన్న సత్య పాల్ మాలిక్ ను సత్యానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచారు. వాస్తవాలను చెప్పకపోతే ఏ పదవిలో ఉంటే ఏం లాభం అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన భౌతికంగా లేక పోవచ్చు . తన కోసం వేలాది మంది రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తమ సంక్షేమం కోసం రాచరిక పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా గొంతు విప్పిన అరుదైన ప్రజా నాయకుడు సత్య పాల్ మాలిక్ అంటూ వాపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, క్రీడాకారులు సైతం మాలిక్ ను స్మరించుకుంటున్నారు. ఆయనకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నారు.
రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ఇవ్వాలని, ఇది రాజ్యాంగ పరమైన హక్కు అని ధైర్యంగా బహిరంగంగా ప్రకటించాడు సత్య పాల్ మాలిక్. ఎవరైనా బలమైన సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే జంకుతారు. ప్రధానంగా మీసాలు మెలేసిన వాళ్లు, తమకు ఎదురే లేదని విర్రవీగిన వాళ్లు, అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నేతలంతా ఇవాళ మౌనంగా ఉండి పోయారు. మోదీ, అమిత్ షా దెబ్బకు జడుసుకున్నారు. కానీ ఈ దేశంలో ఒకే ఒక్కడు మాత్రం బీజేపీలోనే ఉంటూనే ఈ ఇద్దరినీ ప్రశ్నించాడు. నిగ్గదీసి నిలదీశాడు. మీరు చేస్తున్నది తప్పు అంటూ ఎత్తి చూపాడు సత్యపాల్ మాలిక్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషలు, రైతులని ప్రకటించాడు. అంతే కాదు బీజేపీ ఎంపీ వినేష్ ఫోగట్ పై లైంగిక వేధింపులకు పాల్పడితే నిప్పులు చెరిగారు. ఇంత మంది నేతలు ఉండీ ఏం లాభం అంటూ నిలదీశారు. మోదీకి నిద్రలేకుండా చేశాడు. తను నమ్మిన సిద్దాంతాల కోసం చివరి దాకా కట్టుబడి ఉన్నారు ఆయన. పార్టీ లైన్ కంటే రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన కీలకమైన గవర్నర్ పదవిలో ఉంటూనే మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక రాజకీయ నాయకుడు సత్య పాల్ మాలిక్.
జమ్మూ కాశ్మీర్ చివరి గవర్నర్ ఆయన. 2021లో ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిన రైతులు చేపట్టిన ఆందోళనకు బహిరంగంగా మద్దతు పలికాడు. ఆయన హయాంలోనే ఆర్టికల్ 370 రద్దయింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి బేషరతు మద్దతు పలికాడు. 50 ఏళ్లకు పైగా అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తనపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసినా అదంతా మోదీ, షా కుట్రలో భాగమంటూ మండిపడ్డాడు. ఎక్కడా అధైర్య పడలేదు సత్య పాల్ మాలిక్. రైతుల ఉద్యమానికి, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్ల ఆందోళనకు సపోర్ట్ చేసినందుకే తనను టార్గెట్ చేశారని అయినా భయపడనంటూ తనే వార్నింగ్ ఇచ్చాడు,
తను గవర్నర్ గా ఉన్న సమయంలో రెండుసార్లు లంచం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని అగ్ర నాయకత్వానికి తెలిపినా పట్టించు కోలేదన్నారు. ఆ తర్వాత గోవా, మేఘాలయ గవర్నర్ గా చేశారు. పదవి నుంచి తప్పుకున్నాక 2019లో పుల్వామా దాడిలో మరణాలకు కేంద్రం చేసిన తప్పిదాలే కారణమని విమర్శించారు. పహల్గామ్ దాడికి నిర్లక్ష్యమే కారణమన్నారు సత్యపాల్ మాలిక్. రైతు కుటుంబంలో పుట్టిన మాలిక్ జాట్ నాయకుడిగా ఎదిగాడు. 1974లో ఎమ్మెల్యేగా, 1980లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1989లో వీపి సింగ్ సర్కార్ లో మంత్రిగా పని చేశారు. 2004లో బీజేపీలో చేరారు. 2012లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో బీహార్ గవర్నర్ గా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. పుట్టుకతోనే తాను తిరుగుబాటు దారుడినని ప్రకటించారు. సత్య పాల్ మాలిక్ జీవన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. కానీ తాను నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం , రైతులు, ప్రజల కోసం చివరి దాకా పోరాడిన తీరు మాత్రం ఎల్లప్పటికీ దేశ చరిత్ర ఉన్నంత కాలం ఉండి పోతుంది. చిరస్థాయిగా ఆయన జనం గుండెల్లో నిలిచి పోతారు.