
ఇంద్రకీలాద్రి కొండపై పోటెత్తిన భక్తులు
విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దేవాలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉత్సవాలలో ఇది రెండో రోజు. కనకదుర్గమ్మ ఇవాళ గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. మంగళవారం ఏపీకి చెందిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ . సవిత, జి. సంధ్యా రాణి, ప్రశాంతి, గల్లా మాధవి, శిరీషా దేవి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిన అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ వారిని వేడుకోవడం జరిగిందన్నారు ఈ సందర్బంగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని తాము అంచనా వేశామన్నారు . ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తాను భక్తులతో కూడా ఏర్పాట్లపై ఆరా తీశామన్నారు. వారంతా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మ వారిని ప్రార్థించినట్లు చెప్పారు.